గుజరాత్ రాజ్‌కోట్‌లోని టీఆర్‌పీ గేమ్ జోన్‌లో శనివారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 30మంది అగ్నికి ఆహుతయ్యారు. ఇందులో 12 మంది చిన్నారులున్నాయి. సమ్మర్ హాలిడేస్, అందులోనూ వీకెండ్ కావడంతో శనివారం సాయంత్రం వేళ సరదాగా గడిపేందుకు పెద్దసంఖ్యలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు వస్తారని తెలిసినా అనుకోని ఘటన జరిగినప్పుడు గేమ్జోన్ నిర్వాహకులు.. కస్టమర్ల రక్షణ చర్యలను గాలికొదిలేసినట్లు సమాచారం. ఈ ప్రమాదానికి సంబంధించి టీఆర్పీ గేమింగ్ జోన్ పార్టనర్లు అయిన ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ఇద్దరిని అరెస్ట్ చేశారు.
గేమ్ జోన్ నిర్వాహకులు అవసరమైన అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వవర్గాల సమాచారం. రాజ్‌కోట్ దుర్ఘటన మానవతప్పిదంగానే ప్రాథమికంగా కనిపిస్తోందని అభిప్రాయపడిన గుజరాత్ హైకోర్టు దీనిపై సోమవారం సుమోటోగా విచారణ చేపడతామని ప్రకటించింది. గేమ్ జోన్లు, రిక్రియేషన్ క్లబ్‌లు అనుమతులు లేకుండానే నడుస్తున్నాయన్న హైకోర్టు అహ్మదాబాద్, వడోదర, సూరత్, రాజ్‌కోట్ నగరపాలక సంస్థల తరఫు న్యాయవాదులు సోమవారం తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. గేమ్ జోన్లు, క్లబ్‌ల ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు ఇస్తున్నారు, ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తున్నారో తమకు వివరించాలని స్పష్టం చేసింది.