రెమాల్ తుపాను ఈశాన్య రాష్ట్రాల్లో పెను ప్రభావం చూపుతోంది. ఈ తుపాను ప్రభావంతో మిజోరంలో జరిగిన వివిధ ప్రమాదాల్లో 27 మంది మృతి చెందారు. ఐజ్వాల్లోని శివారు ప్రాంతంలో భారీ వర్షానికి ఓ రాతి క్వారీ కూలిపోయిన ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. 8 మంది ఆచూకీ దొరక్కపోవడం వల్ల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు హ్లిమెన్ వద్ద, కొండచరియలు విరిగిపడటం వల్ల అనేక ఇళ్లు కూలిపోయాయి. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు గల్లంతయ్యారు.
మిజోరంలో ఈరోజు కూడా చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపులతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. రాతి క్వారీ కూలిన ఘటనతో పాటు వర్షాల కారణంగా సంభవించిన విపత్తుల్లో మరణించిన వారి కుటుంబాలకు సీఎం లాల్‌దుహోమా రూ.4 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అలాగే రాష్ట్ర విపత్తు సహాయ నిధికి రూ.15 కోట్లు ప్రకటించారు. మరోవైపు రెమాల్ తుపాను ప్రభావంతో అసోంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ఒక మహిళ సహా నలుగురు మృతి చెందారు. 18 మంది గాయపడ్డారు.