దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ మాల్దీవులకు మళ్లీ భారత్ సాయం చేసింది. రూ.417.45 కోట్ల రుణాన్ని తీర్చేందుకు మరో ఏడాది పొడిగింపు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. వడ్డీలే కుండా ఈ మొత్తాన్ని ఆ దేశం వినియోగించుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు మాల్దీవులు చేసిన విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించింది.
వాస్తవానికి ఈ ద్వీపదేశంతో భారత్ సంబంధాలు ఇటీవల కాలంలో క్షీణించిన విషయం తెలిసిందే. చైనా అనుకూలంగా వ్యవహరించే ముయిజ్జు మాల్దీవుల అధ్యక్షుడిగా అధికారం చేపట్టిన నాటి నుంచి ఇరు దేశాల సంబంధాలు దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో ప్రధానమంత్రి మోదీ లక్షద్వీపుల పర్యటనపై మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలతో ఇరు దేశాల మధ్య టెన్షన్ మరింత పెరిగింది. మరోవైపు ముయిజ్జు ఒత్తిడి చేయడంతో ఆ దేశంలోని సైనిక బృందాన్ని భారత్ ఉపసంహరించుకోవాల్సి వచ్చినా.. ఆ దేశానికి మోదీ ప్రభుత్వం అండగా నిలుస్తూనే ఉంది. భారత్ అందించిన ఆర్థిక సాయంపై మాల్దీవుల విదేశాంగశాఖ మంత్రి మూసా జమీర్ స్పందించారు. భారత విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.