భారతదేశంలో ఉండే ఫార్మా కంపెనీలు ప్రపంచం మొత్తానికి అవసరమైన కరోనా వ్యాక్సిన్ అందించగల శక్తి ఉందని మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తెలిపారు. ప్రస్తుతం భారతదేశంలో కరోనా వైరస్ కు సంబంధించి కొన్ని వేల ప్రయోగాలు జరుగుతున్నాయని, అలాగే దేశంలో ప్రముఖ విషయాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రస్తుతం మానవాళికి అవసరమయ్యే ఎన్నో ఆవిష్కరణలు జరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు. వీటితో పాటు భారతదేశంలో ప్రస్తుతం ఫార్మా పరిశ్రమ చాలా బాగా పనిచేస్తుందని తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ ను ఎలాగైనా సరే ప్రపంచానికి అందించాలన్న తపన భారత ఫార్మా పరిశ్రమలకు ఎక్కువగా ఉందని ఆయన అభివర్ణించారు. ప్రపంచ దేశాలకు పెద్ద మొత్తంలో ఎలాంటి మందులనైనా తయారుచేసి అందించగల సామర్థ్యం భారతదేశ ఫార్మా పరిశ్రమకు ఉందని ఆయన చెప్పుకొచ్చారు. అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ ను భారత్ ప్రపంచ దేశాలకు అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.