త్వరలో ఇటలీలో జీ7 సదస్సు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనపై, సదస్సుపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. తీవ్రవాదం, హింసను సమర్థించే భారత్ వ్యతిరేక శక్తులకు కెనడా ఆశ్రయం కల్పిస్తూనే ఉందని.. ఆ దేశంతో అదే ప్రధాన సమస్య అని భారత విదేశాంగ పేర్కొంది. అటువంటి శక్తులపై ట్రూడో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామని తెలిపింది.
భారత్-కెనడా మధ్య నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచవ్యాప్తంగా మితవాద శక్తుల పెరుగుదల గురించి జస్టిన్ ట్రూడో ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మీడియా అడిగిన ప్రశ్నకు భారత విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా స్పందిస్తూ.. ‘‘ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 64 కోట్ల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ చైతన్యవంతమైన ప్రజాస్వామ్యాన్ని యావత్ ప్రపంచం కళ్లారా చూసింది. ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం ఎలా పనిచేయాలనే దాని గురించి ఎవరో వ్యాఖ్యానించడాన్ని పట్టించుకోము’’ అని పేర్కొన్నారు.