బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలో ఉన్న ‘కోహినూర్’ వజ్రం జగన్నాథ స్వామిదని జగన్నాథ్ సేన సభ్యులు, కవులు డిమాండు చేస్తున్నారు. ‘జగన్నాథుడిని దర్శించుకున్న పంజాబ్ రాజు రంజిత్ సింగ్ స్వామికి కోహినూర్‌ను కానుకగా ఇస్తానని చెప్పారని, అంతలోనే బ్రిటిష్ సైనికులు వజ్రాన్ని కాజేశారని చరిత్రకారుడు, పురుషోత్తమ భక్తుడు సురేంద్ర మిశ్ర వెల్లడించారు. దీనిపై పూరీ జగన్నాథ సేన అధ్యక్షుడు, న్యాయవాది ప్రియదర్శన్ పట్నాయక్ సోమవారం రాత్రి ద్రౌపదీ ముర్ముని కలిశారు. ‘కోహినూర్’పై తాము అంతర్జాతీయ కోర్టుకు వెళతామని తెలిపారు.
కోహినూర్ డైమండ్‌ను బ్రిటీషర్లు 14వ శతాబ్దంలో భారత్‌లో గుర్తించారు. తర్వాత ఎన్నో చేతులు మారింది. 1849లో బ్రిటిషర్లు పంజాబ్‌ను ఆక్రమించిన తర్వాత విక్టోరియా రాణి చెంతకు చేరింది. అప్పటినుంచి ఆ రాజ కుటుంబం కిరీటంలో వెలుగులీనుతోంది. అయితే భారత్‌తో సహా దాదాపు నాలుగు దేశాల్లో దీనిపై యాజమాన్య హక్కుకు సంబంధించిన వివాదం కొనసాగుతోంది.
బ్రిటన్ మహారాణి ఎలిజబెత్-2 మరణంతో కోహినూర్ వజ్రం ఇప్పుడు ఎవరికి వెళ్తుందన్న ఆసక్తి వ్యక్తం అవుతోంది. రాచరికంలో రాజు భార్యకు సహజంగానే రాణి హోదా వస్తుంది. అయితే కెమిల్లా విషయంలో కొంత అనిశ్చితి ఉంది. ప్రిన్స్ చార్లెస్‌కు ఆమె రెండో భార్య కావడం, కెమిల్లాకు కూడా ఇది రెండో వివాహం కావడం ఇందుకు కారణం.