త్రిపురలోని జగన్నాథుడి ఉల్టా రథ యాత్రలో విషాదం చోటుచేసుకుంది. భక్తులు రథాన్ని లాగుతున్న సమయంలో రథానికి హైటెన్షన్ వైరు తగిలి భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉనకోటి జిల్లాలో కుమార్ఘట్ వద్ద బుధవారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు. రథం 133 కేవీ ఓవర్‌హెడ్ కేబుల్‌ను తాకడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు వెల్లడించారు.
జగన్నాథుడి యాత్ర పూర్తైన వారం రోజులకు ఈ ఉల్టా రథయాత్ర జరుగుతుంది. ఇందులో భాగంలో అక్కాచెల్లెలైన బలభద్ర, దేవి సుభద్ర, జగన్నాథుడు తిరిగి తమ నివాసాలకు చేరుకుంటారు. ఈ వేడుకల్లో భాగంగానే వేలాది మంది భక్తులు.. రథాన్ని లాగుతున్నారు. అదే సమయంలో ప్రమాదవశాత్తు 133 కేవీ ఓవర్‌హెడ్ కేబుల్‌ను రథం తాకింది. దీంతో భారీగా మంటలు చేలగేగాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.