భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ బ్రిటన్‌లో ఐదు రోజుల పర్యటన ముగించుకున్నారు. యూకే ప్రధాని రిషి సునాక్‌తో చర్చలు జరిపిన ఆయన.. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్య ఒప్పందంపై చర్చల్లో పురోగతిని, ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. అనంతరం ఆయన లండన్ నుంచి భారత్‌కు బయల్దేరారు. అయితే బయల్దేరే ముందు జైశంకర్.. అక్కడ ‘రాయల్ ఓవర్సీస్ లీగ్’ వద్ద ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన కెనడా – భారత్ వివాదంపై మరోసారి స్పందించారు.
ఖలిస్థానీ వేర్పాటువాద నాయకుడు హర్‌దీప్ సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురికావడం వెనుక భారతదేశ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆరోపణలను సమర్థించుకునేలా ఆ దేశం ఆధారాలు సమర్పిస్తే విచారణ జరిపేందుకు సిద్ధంగా ఉన్నామని జైశంకర్ పునరుద్ఘాటించారు. ఇప్పటి వరకు కెనడా దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలను తమతో పంచుకోలేదని చెప్పారు. భారత్ నుంచి ఖలిస్థాన్ విడిపోవడాన్ని ప్రోత్సహించేలా రాజకీయ అభిప్రాయాలు వ్యక్తం కావడానికి కెనడా రాజకీయాలు ఆస్కారమిచ్చాయని జైశంకర్ అభిప్రాయపడ్డారు. వాక్ స్వాతంత్య్రానికి కొన్ని పరిమితులు, బాధ్యతలు ఉంటాయని.. అవి దుర్వినియోగం అవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం తప్పు అని స్పష్టం చేశారు.