భారత్ తీసుకున్న నిర్ణయం వల్లే అంతర్జాతీయంగా చమురు కొనుగోలు ధరలు పెరగకుండా ఉన్నాయని భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో భారత్ తన కొనుగోలు విధానాల ద్వారా చమురు, గ్యాస్ ధరలు పెరగకుండా అంతర్జాతీయ ద్రవ్యోల్బణాన్ని నియంత్రించిందని అన్నారు. చమురు ధరలు కట్టడి చేసినందుకు ప్రపంచ దేశాలు భారత్‌కు కృతజ్ఞతలు చెప్పాలని జైశంకర్ వ్యాఖ్యానించారు.
భారత్ కొనుగోలు విధానాలు అంతర్జాతీయ ద్రవ్యోల్బణం అదుపు తప్పకుండా ఉపయోగపడ్డాయని జై శంకర్ భావించారు. అందుకు భారత్‌కు ప్రపంచ దేశాలన్నీ కృతజ్ఞతలు చెప్పాలని.. దానికోసం తాను ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకుంటే.. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు విక్రేతల వద్దకే తాము కూడా వెళ్లాల్సి వచ్చేదని.. అప్పుడు చమురు ధరలు ఎవరూ ఊహించనంతగా పెరిగేవని వెల్లడించారు. ఫలితంగా అదే ధరలకు ఐరోపా కూడా చమురు కొనుగోలు చేయాల్సి వచ్చేదని.. అదే సమయంలో రష్యాతో భారత్ తన బంధాన్ని కొనసాగించాలని నిర్ణయించడంతో ఈ ముప్పు తప్పిందని జైశంకర్ వ్యాఖ్యానించారు.