దిల్లీ వచ్చిన బ్రిటన్ మంత్రికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ ఝలక్ ఇచ్చారు. బీబీసీపై ఐటీ సోదాలపై బ్రిటన్ మంత్రి జేమ్స్ క్లీవర్లీ అడిగిన ప్రశ్నకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. భారత్లో పనిచేసే సంస్థలన్నీ సంబంధిత చట్టాలను పూర్తి స్థాయిలో పాటించాలన్నారు జైశంకర్ స్పష్టం చేశారు. దిల్లీలో ఇవాళ ఇద్దరి మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. జీ20 సదస్సులో భాగంగా జరిగే విదేశాంగ మంత్రులు సమావేశం కోసం జేమ్స్ క్లీవర్లీ భారత్కు వచ్చారు.
బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీతో జైశంకర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. భారత్-బ్రిటన్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా వీరిద్దరూ చర్చలు జరిపారు. ఇదే సమావేశంలో బ్రిటన్ విదేశాంగ మంత్రి జేమ్స్ క్లీవర్లీ.. బీబీసీపై జరిగిన ఆదాయ పన్ను దాడుల గురించి ప్రస్తావించారు. దీనికి బదులిచ్చిన జై శంకర్.. భారత్లో పనిచేసే సంస్థలన్నీ అందుకు సంబంధించిన చట్టాలు, నిబంధనలు పాటించాలన్నారు. సమావేశం అనంతరం జైశంకర్ ఓ ట్వీట్ చేశారు. “ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల పురోగతిపై సమీక్షించుకున్నాం. ప్రపంచ పరిస్థితులు, జీ20 అజెండాపై అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాం” అని తెలిపారు.