ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన కేదార్‌నాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శుక్రవారం తెరుచుకున్నాయి. శీతాకాలంలో మూసేసిన ఈ ఆలయాలను ఈరోజు అధికారులు తెరిచారు. ఇవాళ ఉదయం 7.15 గంటలకు కేదార్నాథ్ ధామ్ ఆలయ తలుపులు తెరుచుకున్నారు. మరోవైపు ‘చార్‌ధామ్ యాత్ర’లో భాగమైన బద్రీనాథ్ ఆలయాన్ని ఈ నెల 12న తెరవనున్నారు. ఆనవాయితీ ప్రకారం.. 47 కి.మీ. దూరంలో ఉన్న ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయం నుంచి కేదార్ బాబా పంచముఖ విగ్రహాన్ని వాలంటీర్లు పాదరక్షలు లేకుండా కాలి నడకన భుజాలపై మోస్తూ తీసుకొచ్చినట్లుకేదార్‌నాథ్ ఆలయ కమిటీ మీడియా ఇంఛార్జి తెలిపారు.
కేదార్నాథ్ ఆలయం తెరుచుకున్న సందర్భంగా గుడిని 24 క్వింటాళ్ల పూలతో అలంకరించారు. ప్రధాన ద్వారం తాళం పాలకవర్గం సమక్షంలో తెరిచారు. ఆ తర్వాత గర్భగుడి తలుపులు తెరిచి, రావల్, ప్రధాన పూజారి పూజలతో పాటు గర్భగుడిలో సాధారణ దర్శనాన్ని ప్రారంభించారు. తొలిరోజు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరంతరాయంగా దర్శనం కొనసాగుతుందని అధికారులు తెలిపారు. మే 11, శనివారం నాడు కేదార్‌నాథ్‌లో రక్షక దేవతగా భైరవనాథుని తలుపులు తెరవడంతో, కేదార్‌నాథ్ ఆలయంలో బాబా కేదార్ హారతి, భోగ్ ప్రసాదం ఏర్పాట్లు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.