జమిలి ఎన్నికలపై తాజాగా మరో అడుగు ముందుకు పడింది. ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం జరిపిన విషయం తెలిసిందే. తాజాగా ఈ నివేదికను కోవింద్ కమిటీ ఈరోజు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించింది.
మొత్తం 18 వేల 626 పేజీలతో కూడిన నివేదికను రాష్ట్రపతి భవన్‌కు వెళ్లి ద్రౌపదీ ముర్ముకు అందించినట్టు కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2023 సెప్టెంబర్ 2వ తేదీన ఏర్పాటైన కోవింద్ కమిటీ 191 రోజుల పాటు వాటాదారులు, నిపుణులతో విస్తృతమైన సంప్రదింపులు జరిపింది. ఈ సమావేశాల ద్వారా క్షుణ్నంగా పరిశోధించి ఈ నివేదిక రూపొందించినట్టు కమిటీ పేర్కొంది. లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలను ఏక కాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాలని కమిటీ సూచించినట్లు సమాచారం. మూడు స్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని రామ్నాథ్ కోవింద్ కమిటీ నివేదిక సూచించినట్లు తెలుస్తోంది.