దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంతలా పెరిగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే పెట్రోల్ ధర రూ.100 తాకింది. ఈ క్రమంలో సామాన్య ప్రజలు పెరిగిన ఇంధన ధరలతో అల్లాడిపోతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఇదే అదునుగా చేసుకుని కేంద్రంపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశి థరూర్ కేంద్రంపై విమర్శలు చేశారు.
యోగా గురువు బాబా రామ్‌దేవ్‌లాగా యోగా పాఠాలను నేర్చుకుంటే పెట్రోల్ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే.. యోగాలో శీర్షాసనం వేస్తే.. అప్పుడు తలకిందులుగా ఉంటాం కదా.. దాంతో 90 కాస్తా 06 గా కనిపిస్తుంది. అంటే లీటర్ పెట్రోల్ ధర రూ.06 గా కనిపిస్తుంది.. అని శశిథరూర్ ట్వీట్ చేశారు. అందులో బాబా రామ్ దేవ్ శీర్షాసనం వేసి రూ.90 లీటర్ ఉన్న పెట్రోల్ ధర పోస్టర్‌ను చూస్తుండడం విశేషం.
If you took yoga lessons from BabaRamdev, you too could see petrol prices at 06 rupees a litre! pic.twitter.com/zatuS6t6cs
— Shashi Tharoor (@ShashiTharoor) February 16, 2021
ఇక గత వారం, పది రోజుల నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలోనే రాజస్థాన్‌లో అత్యధికంగా వ్యాట్ వసూలు చేస్తున్నారు. దీంతో అక్కడ లీటర్ పెట్రోల్ ధర రూ.99.87 కు చేరుకుంది. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.89.29 ఉండగా, ముంబైలో రూ.95.75గా ఉంది. అలాగే అక్కడ డీజిల్ ధర రూ.86.72గా ఉంది.