మానవ హక్కులపై భారత్‌కు పాఠాలు చెప్పడం ఏమాత్రం పనిచేయబోదని ఇండియన్ అమెరికన్ చట్టసభ సభ్యులు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో ఇరు దేశాలు సుహృద్భావ వాతావరణంలో చర్చించుకోవడం మేలని పేర్కొన్నారు. ఇతర దేశాలకు హితవు చెప్పేముందు అమెరికా వ్యవస్థలోని లోపాలనూ గమనించుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ‘దేశీ డిసైడ్స్’ పేరిట నిర్వహించిన సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత్ వందల ఏళ్ల పాటు విదేశీ పాలనలో ఉందని, అలాంటి వారికి మానవ హక్కుల గురించి చెప్పడం హితబోధ చేసినట్లవుతుందని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా అన్నారు. వందల సంవత్సరాలుగా వలసవాద శక్తులు ఉపన్యాసాలు ఇస్తున్నాయని వారు (భారత్) స్పష్టంగా చెబుతున్నారని, అలాంటప్పుడు మన మాటలు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వవని పేర్కొన్నారు. ఇరు దేశాల్లోని లోపాలను గుర్తించి.. వాటిని కలిసికట్టుగా ఎలా పరిష్కరించుకోవాలి? తద్వారా ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను ఎలా కాపాడుకోవాలి? అనే ధోరణిలో చర్చించుకుంటే మేలు అని కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తెలిపారు.