సార్వత్రిక ఎన్నికల్లో మూడో విడత పోలింగ్ ప్రారంభమైంది. 11 రాష్ట్రాల్లోని 93 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. ఉదయం 9 దాటితే ఎండ విపరీతంగా ఉంటుండటంతో ఓటర్లు ఉదయాన్నే పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఓటింగ్ షురూ కాకముందు నుంచే పోలింగ్ స్టేషన్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ దశలో మొత్తం 1351 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. పోలింగ్ జరగనున్న స్థానాలు: 93 ఉండగా.. గుజరాత్- 25, కర్ణాటక- 14, మహారాష్ట్ర- 11, ఉత్తర్ ప్రదేశ్- 10, మధ్యప్రదేశ్- 9, ఛత్తీస్గఢ్- 7, బిహార్- 5, బంగాల్- 4, అసోం- 4, గోవా- 2, దాద్రానగర్ హవేలీ, దమణ్ దీవ్- 2 చొప్పున ఉన్నాయి.
మూడో దశలో బరిలో కేంద్రమంత్రులు అమిత్ షా, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, పురుషోత్తమ్ రూపాలా, ప్రహ్లాద్ జోషి, ఎస్.పి.సింగ్ బఘెల్ కూడా నిలిచారు. గుజరాత్, కర్ణాటక, బిహార్, మధ్యప్రదేశ్‌ల్లో ఈరోజు పోలింగ్ జరగనున్న అన్ని స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయే దక్కించుకుంది. వాటిని నిలబెట్టుకునేందుకు కమల దళం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇవాళ జరగనున్న పోలింగ్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం పరిధిలోని అహ్మదాబాద్ నగరంలో మోదీ, అమిత్ షా మంగళవారం ఓటు వేయనున్నారు.