18వ లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఎప్పటిలాగే సభాపతి పదవిని ఏకగ్రీవం చేసేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నించినా విపక్షాలతో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చరిత్రలో తొలిసారి స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. ఈ స్థానం కోసం ఎన్డీఏ తరఫున ఓం బిర్లా నామినేషన్ వేశారు. విపక్ష ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ఎంపీ కె సురేశ్ బరిలో నిలిచారు.
అయితే అంతకుముందు రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. స్పీకర్ ఎన్నికకు సహకరించాలని అధికారపక్షం ఇండియా కూటమిని కోరిందని.. సంప్రదాయం ప్రకారం డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకు ఇవ్వాలని అడిగామని చెప్పారు. అయితే డిప్యూటీ స్పీకర్ పదవిపై ఖర్గేతో చర్చిస్తామని నిన్న రాజ్‌నాథ్ అన్నారు. ఇప్పటివరకు ఖర్గేను చర్చలకు పిలవలేదు. డిప్యూటీ స్పీకర్‌ను ఖరారు చేయకుండానే స్పీకర్ ఎన్నికకు సహకరించాలన్నారు. అధికారపక్షం తీరు ఇండియా కూటమిని అవమానించేలా ఉంది. అందుకే మేం మా అభ్యర్థిని బరిలోకి దింపాం. అని రాహుల్ తెలిపారు.
మరోవైపు డిప్యూటీ స్పీకర్ పదవిపై ఇండియా కూటమి షరతులు విధించిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ అన్నారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులు ఏ పార్టీకి చెందినవి కావని.. వాటిపై షరతులు సరికాదని వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి సంప్రదాయాలను పాటించట్లేదన్నారు.