గత ఐదేళ్లలో ఎల్‌పీజీ సిలిండర్ ధర 42% పెరగ్గా, ప్రభుత్వం ప్రజలకు అందించే సబ్సిడీ మొత్తం 92% తగ్గిందని కేంద్ర పెట్రోలియంశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తెలిపారు. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అడిగిన ప్రశ్నకు పలు వివరాలతో సమాధానమిచ్చారు. 2018 జనవరి 1 నాడు 14.2 కేజీల గృహావసర ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.741 ఉండగా, 2023 ఫిబ్రవరి 1 నాటికి అది రూ.1,053 (42.10%)కి చేరినట్లు కేంద్రమంత్రి తెలిపారు.
ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం అందించే సబ్సిడీ 2017-18లో రూ.23,464 కోట్లమేర ఉండగా, 2021-22లో అది రూ.1,811 కోట్లకు తగ్గినట్లు వెల్లడించారు. ఐదేళ్లలో ఎల్‌పీజీ సబ్సిడీ పొందే వారి సంఖ్య 20,21,20,070 నుంచి 28,36,77,886 (40.35%పెరుగుదల)కి చేరినట్లు తెలిపారు.
పెట్రో ఉత్పత్తులపై విధిస్తున్న పన్నుల కారణంగా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరే ఆదాయం గత ఐదేళ్లలో 46% పెరగ్గా, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం మాత్రం 36% మాత్రమే పెరిగిందని సహాయమంత్రి రామేశ్వర్ మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 2017-18 నుంచి 2021-22 మధ్యకాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి పెట్రో ఉత్పత్తుల ద్వారా రూ.31,21,173 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు రూ.19,65,891 కోట్లు చేరగా, రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.11,55,282 ఆదాయం చేకూరినట్లు తెలిపారు.