కన్నతల్లికి నిప్పంటించి ఆమె ఆర్తనాదాలను ఫోన్‌లో చిత్రీకరిస్తూ కొడుకు పైశాచికానందం పొందిన అమానవీయ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. యూపీలోని అలీగఢ్‌లోని ఖైర్ పోలీస్ స్టేషన్‌కు గౌరవ్ అనే వ్యక్తి భూవివాదాల నేపథ్యంలో తన తల్లితో కలిసి వచ్చాడు. ఆమె గౌరవ్‌పై ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంతో ఇరువురు తమ వారితో కలిసి వివాదాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు. ఎంతకీ తేలకపోవటంతో తల్లి ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు అక్కడికి చేరుకొని ఆమె చేతిలో ఉన్న లైటర్‌ను లాక్కునే ప్రయత్నం చేయగా.. అది కింద పడిపోయింది. పక్కనే ఉన్న గౌరవ్ ఆమెకు నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా దాన్ని ఫోన్లో చిత్రీకరించాడు. అక్కడే ఉన్న అధికారులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించా అప్పటికే 40 శాతం కాలిపోయింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది.