రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి ఏకాదశి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆషాడంలో వచ్చే ఏకాదశిని తెలంగాణ ప్రజలందరూ ఏడాదిలో వచ్చే పండుగలకు ఇదే మొదటి పండుగగా జరుపుకుంటారని ఆయన అన్నారు. తొలి ఏకాదశి రాష్ట్ర ప్రజల జీవితాల్లో సుఖ సంతోషాలు, సకల శుభాలు కలిగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.రెండు లక్షల రైతుల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతు కుటుంబాలన్నీ రుణ విముక్తి పొందాలని, ఏకాదశి పండుగను ప్రతి ఇంటా ఆనందంగా జరుపుకోవాలని సీఎం ఆకాంక్షించారు.
త్యాగనిరతికి, అనిర్వచనీయ సహనానికి మొహరం ప్రతీకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ముహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానాన్ని సంస్మరణగా మొహర్రం జరుపుకుంటున్నామని పేర్కొన్నారు. తరతరాలుగా రాష్ట్రంలో హిందూ ముస్లింలు కలిసి పీర్ల ఊరేగింపు నిర్వహిస్తారని గుర్తు చేసుకున్నారు. రాష్ట్రంలో గంగా, జమున, తెహజీబ్‌కి గొప్ప నిదర్శనం పీర్ల ఊరేగింపు అన్న రేవంత్.. కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య సఖ్యతకు, ఐక్యతకు వారధిగా మొహరం నిలుస్తుందని అభిప్రాయపడ్డారు.