పార్లమెంటులో చైనాతో సరిహద్దు వివాదంపై తీవ్ర దుమారం రేగింది. ఈ అంశంపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలను విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్రంగా ఖండించారు. రాజకీయ విమర్శలతో తమకు ఎలాంటి సమస్యా లేదని.. అయితే, సైన్యాన్ని ఎవరూ అగౌరవపర్చకూడదని అన్నారు. చైనా వ్యవహారంలో తాము ఉదాసీనంగా ప్రవర్తించడం లేదని స్పష్టం చేశారు. వారిపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. డ్రాగన్ సమస్యను విదేశాంగ మంత్రి లోతుగా అర్థం చేసుకోవాలంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
“నేను లోతుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ నాకు సలహా ఇచ్చారు. ఈ సలహా ఎవరి నుంచి వచ్చిందో తెలిసిన తర్వాత.. ఆయనకు వంగి నమస్కరించడం తప్ప ఏమీ చేయలేను. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యాన్ని విమర్శించకూడదు. మన సైనికులు సరిహద్దులో 13వేల అడుగుల ఎత్తున పహారా కాస్తున్నారు. వారికి గౌరవం ఇవ్వాలి. చైనా పట్ల మేం నిర్లక్ష్యం వ్యక్తం చేయలేదు. ఉద్రిక్తతల సమయంలో భారత సైన్యాన్ని సరిహద్దుకు ఎవరు పంపారు? సరిహద్దులో సాధారణ పరిస్థితి కోసం ఎవరు ఒత్తిడి తెస్తున్నారు? చైనాతో మన సంబంధాలు సాధారణంగా లేవని ఎవరు ఒత్తిడి తెస్తున్నారు?”
-జైశంకర్, విదేశాంగ మంత్రి