ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద కాంగ్రెస్ సంకల్ప్ సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. మహాత్మా గాంధీ సమాధి రాజ్ ఘాట్ వద్ద రాహుల్ గాంధీకి మద్దతు తెలుపుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. ఈ దీక్షలో పాల్గొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. ఇలాంటి సత్యాగ్రహ దీక్షలు దేశవ్యాప్తంగా జరుగుతాయన్నారు. బిజెపి ప్రభుత్వం, మోడీ కాంగ్రెస్ ని బలహీన పార్టీ అనుకుంటుందని.. మమ్మల్ని బలహినులు అనుకోకండి.. ఇటుకకి సమాధానం రాయితో చెబుతాం అని హెచ్చరించారు.
దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, ప్రజా హక్కులను కాపాడేందుకు పోరాడుతూనే ఉంటామన్నారు మల్లికార్జున ఖర్గే. ఇందుకు ఏ త్యాగలకైనా మేము సిద్ధం అని స్పష్టం చేశారు. ఇదే పని రాహుల్ గాంధీ చేస్తున్నారని వివరించారు. రాహుల్ గాంధీ దేశం కోసం, దేశ ప్రజలు, యువత, మహిళలు, నిరుద్యోగుల కోసం పోరాడుతున్నారని అన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తి పై కేసు పెట్టారని మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడితే మోడీకి నచ్చదన్నారు. మోడీని కూడా పరువు నష్టం కేసులో జైలుకు పంపాల్సిందేనన్నారు.
గుజరాత్ అల్లర్ల సందర్భంగా ప్రజలను కుక్కలతో పోల్చారని ఆరోపించారు మల్లికార్జున ఖర్గే. దేశాన్ని దోచుకున్న నిరవ్ మోడీ, లలిత్ మోడీ, మొహుల్ చోక్సి ఒబిసిలా? అని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని.. రాహుల్ గాంధీ సందేశాన్ని ఇంటింటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం బలపడితేనే ఓటు వేసే హక్కు ఉంటుందని.. లేదంటే నియంతృత్వం రాజ్యమేలుతుందన్నారు.