వచ్చేసింది.. 2023 ఏడాదికి ప్రతిష్టాత్మక ఫొర్బ్స్ 37వ వార్షిక ప్రపంచ బిలియనీర్ల జాబితా వచ్చేసింది. ప్రతి ఏడాది లాగే.. ఈ ఏడాది కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ నేత ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఈసారి ముకేశ్ అంబానీ 9వ స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన సంపద 83.4 బిలియన్ల డాలర్లుగా ఉంది. దీంతో ఆసియాలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. గతేడాది 90.7 బిలియన్ డాలర్ల సంపదతో 10వ స్థానంలో ఉన్న అంబానీ.. ఈ ఏడాది ఓ మెట్టు పైకి ఎక్కారు.
తాజా జాబితాలో మైక్రోసాఫ్ట్‌కు చెందిన స్టీవ్ బాల్మర్, గూగుల్‌కు చెందిన లారీ పేజ్- సెర్గీ బ్రిన్, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్, డెల్ టెక్నాలజీస్‌కు చెందిన మైఖేల్ డెల్ కంటే ముకేశ్ అంబానీ ఎగువ స్థానంలో ఉన్నారు. మరోవైపు భారత్‌లోనే రెండవ అత్యంత సంపన్న వ్యక్తిగా కొనసాగిన గౌతమ్ అదానీ.. తన కంపెనీల షేర్ల ధరలు పతనమైన కారణంగా ఈ ఏడాది 24వ స్థానానికి పడిపోయారు. ప్రస్తుతం ఆయన సంపద విలువ 47.2 బిలియన్ డాలర్లని అంచనా.