ఈ కరోనా కష్ట కాలంలో ప్రజలకు సేవ చేయడానికి చాలా మంది భయపడుతున్నారు. అయితే గుజరాత్ లో సూరత్‌లో నాలుగు నెలల గర్భవతి మాత్రం ప్రజలకు సేవ చేయడానికి స్వచ్చందంగా ముందుకు వచ్చారు. నాన్సీ అయేజా మిస్త్రీ అనే డాక్టర్… పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటూ ఆమె ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. వైరస్ బారిన పడకుండా చాలా జాగ్రత్తగా సేవలు అందిస్తున్నారు.
ఆల్తాన్ కమ్యూనిటీ హాల్లోని అటల్ కోవిడ్ -19 సెంటర్లో రోజూ ఎనిమిది నుంచి పది గంటలు ఆమె రోగులకు వైద్యం అందిస్తున్నారు. జాతీయ మీడియాతో మాట్లాడుతూ… నాన్సీ అయెజా మిస్త్రీ “నాకు గర్భంలో ఒక బిడ్డ ఉంది. కానీ నా కర్తవ్యం నాకు చాలా ముఖ్యం. దేవుని దయ వల్ల, పవిత్ర రంజాన్ మాసంలో రోగులకు సేవ చేయడానికి నాకు అవకాశం ఉంది.” అంటూ ఆమె సంతోషపడింది.