మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులే ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని పరిశోధనలో శాస్త్రవేత్తలు గుర్తించారు. జంక్‌ఫుడ్స్, వ్యాయామం లేకపోవడం.. భోజనం, నిద్ర విషయాలలో సమయాలను పాటించకపోవడం వల్ల వ్యాధులు పెరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు 56 శాతం రోగాలకు అనారోగ్యకర ఆహారమే కారణమని గుర్తించారు. మంచి ఆరోగ్యం కోసం ఏం తినాలి? ఎప్పుడు తినాలి? వంటి అంశాలను ‘డైటరీ గైడ్‌లైన్స్ ఫర్ ఇండియన్స్’ పేరుతో తాజాగా జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్) విడుదల చేసింది.
- ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో కనీసం 8 రకాల ఆహార పదార్థాలు ఉండాలి. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఇతరాలు కలిపి 500 గ్రాముల వరకు ఉండాలి.
- అధిక చక్కెర, కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉండే అల్ట్రాప్రాసెస్డ్ ఆహారం (చిప్స్, పిజ్జాలు, బర్గర్లు, కూల్‌డ్రింక్స్) తగ్గించాలి.
- పండ్లను నేరుగా తినడం మంచిది. పొటాషియం, కాల్షియాన్ని అందించే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి.
- ప్రొటీన్ సప్లిమెంట్ల బదులు కోడిగుడ్లు, పాలు, సోయాబీన్స్, బఠానీలు తీసుకోవాలి.
- అన్నం, కూర, పప్పు, పెరుగు వంటివాటికే పరిమితం కాకుండా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు రోజూ తప్పనిసరి చేసుకోవాలి.
- ఆరోగ్య రక్షణకు తగినంత నీరు తాగాలి. భోజనానికి గంట ముందు, గంట తరువాత టీ, కాఫీలు తాగకూడదు. పాలు లేని గ్రీన్, బ్లాక్ టీ తాగడం ఉత్తమం.
- వంటకు ముందు ఆహార పదార్థాలు శుభ్రం చేయడం, పూర్తి స్థాయిలో ఉడికించడంలో నిర్లక్ష్యం వద్దు. అధికంగా నూనెలు, కొవ్వు, తీపి, ఉప్పు వాడొద్దు.
- సాధారణంగా వ్యక్తి రోజుకు 8 గ్లాసులు (సుమారు రెండు లీటర్లు) నీళ్లు తాగాలి.