లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన డబ్బు తన వద్ద లేవని, అందుకే పార్టీ ప్రతిపాదనను తిరస్కరించానని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అవకాశం కల్పించారని, కానీ నిధుల కొరత వల్ల పోటీ చేయాలనుకోలేదని స్పష్టం చేశారు.
ఏపీ, తమిళనాడు.. ఈ రెండింట్లో ఎక్కడ పోటీ చేసినా తనకు ఓ సమస్య ఉందని, ఈ రెండు స్థానాల్లో గెలుపునకు కుల మతాల వంటి అంశాలు పరిగణనలోకి వస్తాయని నిర్మలా సీతారామన్ అన్నారు. తాను ఆ రీతిలో గెలుపునకు పోటీ పడలేనని, అందుకే పోటీ చేయలేనని చెప్పినట్లు తెలిపారు. ఓ జాతీయ వార్తా ఛానల్ నిర్వహించిన సదస్సులో ఈ విషయాన్ని వెల్లడించిన నిర్మలా సీతారాామన్.. పార్టీకి చెందిన ఇతర అభ్యర్థుల కోసం ఎన్నికల్లో తాను ప్రచారం చేస్తానని చెప్పారు. దేశ ఆర్థిక మంత్రిగా ఉన్న వ్యక్తి వద్ద ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన నిధులు లేవా? అని అడిగిన ప్రశ్నకు.. ‘నా జీతం, నా సంపద, నా పొదుపు మాత్రమే నావి. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా మాత్రం నాది కాదు కదా..’ అని నిర్మలమ్మ సమాధానమిచ్చారు.