దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం ‘క్లైమేట్ సెంట్రల్’ అధికారులు తెలిపారు. వడగాలులకూ అవకాశాలున్నాయిని చెప్పారు. మహారాష్ట్ర, బిహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒడిశా సహా మొత్తం 9 రాష్ట్రాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశాలు కొంతమేర ఉన్నాయని వెల్లడించారు. ఈ బృందం 1970 నుంచి ఇప్పటివరకు భారతదేశంలో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉష్ణోగ్రతల తీరుతెన్నుల్ని విశ్లేషించింది.
దీని ప్రకారం.. ఉత్తర భారతం సహా దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తరాదిలో శీతాకాలంలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఈ బృందం నిర్ధారణకు వచ్చింది. 1970లతో పోలిస్తే జమ్మూకశ్మీర్‌లో 2.8, మిజోరంలో 1.9 డిగ్రీల సగటు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొంది. దేశంలోని 51 నగరాల్లో మార్చి ఆఖరి వారంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరే అవకాశాలున్నాయని అమెరికా శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. గ్లోబల్ వార్మింగ్ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం మార్చిలోనూ వడగాలులు వస్తున్నాయని తెలిపింది.