అక్కడ ఉపఎన్నికలో నోటాకు రెండో స్థానం

-

తెలంగాణ సహా దేశవ్యాప్తంగా ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నిక ఔట్ల కౌంటింగ్ ముగిసింది. తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, బిహార్‌, హరియాణా, యూపీ రాష్ట్రాలలోని ఏడు నియోజకవర్గాల్లో ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలోని మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి విజయం సాధించారు. యూపీ, హరియాణా, బిహార్, ఒడిశాలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయం సాధించగా.. బిహార్​లో ఆర్జేడీ, మహారాష్ట్ర అంధేరీ ఉపఎన్నిక స్థానాన్ని శివసేన(ఉద్ధవ్ వర్గం) గెలుచుకున్నాయి. ఈ ఉపఎన్నికల్లో ఓ ప్రాంతంలో నోటాకు రెండో స్థానం దక్కడం గమనార్హం. అదెక్కడంటే..?

అంధేరీ (తూర్పు) సిట్టింగ్‌ ఎమ్మెల్యే రమేశ్‌ లట్కే మరణించడంతో జరిగిన ఉప ఎన్నికలో శివసేన ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం అభ్యర్థి, రమేశ్‌ లట్కే సతీమణి రుతుజ లట్కే విజయం సాధించారు. అయితే, ఇక్కడ బీజేపీ, ఏక్‌నాథ్‌ శిందే వర్గం తమ అభ్యర్థిని ఉపసంహరించుకోవడంతో పోటీ ఏకపక్షమే అయింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ కూడా రుతుజాకే మద్దతు ఇవ్వడంతో చివరకు స్వతంత్రులు మాత్రమే బరిలో ఉన్నారు. శివసేన ఉద్ధవ్‌ వర్గానికి ఈసీ కేటాయించిన కొత్త గుర్తు ‘కాగడా’తో ఈ ఎన్నికల బరిలో నిలవగా.. రుతుజాకు 66వేల ఓట్లు వచ్చాయి.

బరిలో నిలిచిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థుల కన్నా నోటాకే అధికంగా ఓట్లు రావడం గమనార్హం. అంధేరీలో మొత్తం 86,570 ఓట్లు పోల్‌ అవ్వగా.. లట్కేకు 66,530 ఓట్లు, నోటాకు 12,806 (14.79శాతం) ఓట్లు వచ్చాయి. మిగతా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులలో ఎవరికీ 1600కు మించి ఓట్లు రాకపోవడం గమనార్హం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే తిరుగుబాటుతో మహారాష్ట్రలో శివసేన రెండు వర్గాలుగా విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నిక ఇదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version