దేశంలోని ఎల్‌పీజీ వినియోగదారులకు కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ శుభవార్త చెప్పింది. ఇకపై ఏ గ్యాస్ కంపెనీకి చెందిన వినియోగదారుడు అయినా సరే ఇంకో గ్యాస్ కంపెనీ డీలర్ నుంచి రీఫిల్ సిలిండర్ ను పొందవచ్చ. ఈ మేరకు ఆ మంత్రిత్వ శాఖ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
కాగా గ్యాస్ వినియోగదారులకు ఈ సదుపాయం ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద చండీగఢ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణె, రాంచిలలో అందుబాటులోకి రానుంది. తరువాత దేశమంతటా గ్యాస్ వినియోగదారులకు ఈ సదుపాయాన్ని అందిస్తారు. ఇది ఎంతో మందికి ఉపయోగంగా ఉంటుందని ఆ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇప్పటి వరకు ఏ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్‌ను వాడే వారు ఆ కంపెనీకి చెందిన డీలర్ వద్దే రీఫిల్ సిలిండర్‌లను పొందాల్సి ఉండేది. కానీ ఈ సదుపాయం వల్ల తాము గ్యాస్ సిలిండర్ ఏ కంపెనీకి చెందినది అయినా సరే ఇంకో కంపెనీ గ్యాస్ సిలిండర్‌ను పొందవచ్చు. సాధారణంగా కొన్ని చోట్ల ఒకే కంపెనీకి చెందిన గ్యాస్ ఏజెన్సీలు ఉంటాయి. దీంతో ఇతర గ్యాస్ కంపెనీలకు చెందిన ప్రజలు రీఫిల్ సిలిండర్ల కోసం అవస్థలు పడుతుంటారు. కానీ కొత్తగా అందుబాటులోకి రానున్న ఈ సదుపాయం వల్ల అలాంటి ఇబ్బందులు తప్పుతాయి. అయితే దేశమంతటా ఈ సదుపాయాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారో చూడాలి.