చైనా యాప్‌‌లతోనే ఆన్‌లైన్ తరగతులు.. ఇబ్బందుల్లో విద్యార్థులు

-

కొవిడ్-19 మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా విద్యా సంస్థలు మూతపడ్డాయి. దాదాపుగా ‌‘ఆన్‌లైన్’ ద్వారానే విద్యా బోధన కొనసాగుతున్నది. ఇదే చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులకు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. ఇండియాలో చైనా యాప్‌లపై నిషేధం విధించడం, నిషేధిత యాప్‌ల ద్వారానే చైనా యూనివర్సిటీలు ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తుండటంతో విద్యార్థులు చదువుకు దూరం అవుతున్నారు.

చైనాలో పలు యూనివర్సిటీలలో 23,000 మంది విద్యార్థులు చదువుకుంటుండగా అందుల 20,000 వరకు వైద్య విద్యార్థులు ఉన్నారు. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకపోవడంతో ఆన్‌లైన్ ద్వారా తరగతులు నిర్వహిస్తున్నారు.

గత ఏడాది సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతల కారణంగా దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని 250 చైనీస్ యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.

తమ కోర్సులను కొనసాగించడం కోసం దేశంలో నిషేధానికి గురైన మొబైల్ అప్లికేషన్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని చైనా యూనివర్సిటీలు బలవంతం చేస్తున్నాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

చైనాకు చెందిన దాదాపు అన్ని యూనివర్సిటీలు WeChat,DingTalk, SuperStarతోపాటు వీడియో చాట్ యాప్ Tencentను వినియోగిస్తున్నాయి. ఈ యాప్‌లను ఎలాగైనా డౌన్‌లోడ్ చేసుకోవాలని, వాటి ద్వారా తరగతులను కొనసాగించాలని యూనివర్సిటీలు విద్యార్థులకు సూచిస్తున్నాయి.

ఈ సమస్యను ఇండియా, చైనా అధికారులు దృష్టికి తీసుకెళ్లినట్లు ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ చైనా (ఐఎస్‌సీ) సభ్యులు తెలిపారు. తాత్కాలిక పరిష్కారంగా నిషేధానికి గురైన చైనా యాప్‌లను Virtual Private Network (VPN)ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని తరగతులను వింటున్నట్లు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version