భారత్ కు పెను శాపంగా నోటి క్యాన్సర్ మారింది. నోటి క్యాన్సర్ల కారణంగా 2022లో భారత్‌లో ఉత్పాదకత నష్టం సుమారు 560 కోట్ల డాలర్లుగా ఉందని టాటా మెమోరియల్ సెంటర్ (టీఎంసీ) అధ్యయనం తేల్చింది. ఇది దేశ జీడీపీలో 0.18% అని.. నోటి క్యాన్సర్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో మూడింట రెండొంతులు భారత్‌లోనే ఉన్నాయని వెల్లడించింది.
2019 నుంచి 2022 మధ్య 36 నెలల కాలంలో క్యాన్సర్ చికిత్స పొందిన 100 మంది రోగులను టీఎంసీ అధ్యయనం చేయగా.. 91% మరణాలు లేదా నయం చేయలేని క్యాన్సర్లు 41.5 ఏళ్ల వయసు వారిలోనే సంభవించాయని టీఎంసీ తేల్చింది. 70% ప్రారంభ దశ, 86% ముదిరిన దశ క్యాన్సర్లు మధ్య తరగతి కుటుంబాల వారిలోనే బయటపడ్డాయని తెలిపింది. అకాల మరణాల కారణంగా కోల్పోయిన ఉత్పాదకతను మానవ మూలధన విధానం ద్వారా లెక్కించారని పేర్కొంది. ఒక్కో అకాల మరణంతో కోల్పోయిన ఉత్పాదకతను పురుషులైతే రూ.57,22,803, స్త్రీలైతే రూ.71,83,917లుగా గణించారు.