పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. మరోసారి తన వక్రబుద్ధిని చూపెడుతూ.. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. పాకిస్థాన్ రేంజర్లు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్‌ఎఫ్ జవాన్లు, ఓ మహిళ గాయపడినట్లు సైనికాధికారులు తెలిపారు. వారిలో ఓ జవాన్ పరిస్థితి విషమంగా ఉండటంతో….జమ్ము ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. జమ్ము జిల్లా పరిధిలోని RS పుర సెక్టార్ ప్రాంతంలో పాక్ రేంజర్లు 82 MM, 120MM మోర్టార్ షెల్స్‌తోపాటు భారీ మెషిన్ గన్స్‌తో కాల్పులు జరపటంతో…. సరిహద్దు గ్రామాల్లో భయాందోళనలు రేకెత్తించింది.
గురువారం రాత్రి నుంచి పాక్ రేంజర్ల కాల్పులు ప్రారంభంకావటంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్లు, ఆలయాలు, ఇతర సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. అనేక ఏళ్ల తర్వాత భీకరంగా కాల్పులు జరిగినట్లు అక్కడి ప్రజలు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల వరకు ఇరువైపులా కాల్పుల కొనసాగినట్లు BSF అధికారులు తెలిపారు. కాల్పులు నిలిచిపోవటంతో.. ఇప్పుడు ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు చెప్పారు. ఇతర ప్రాంతాలకు వెళ్లిన సరిహద్దుప్రాంత ప్రజలు తమ ఇళ్లకు తిరిగి చేరుకున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు ప్రకటించారు.