ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీజీసీఏ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. పైలట్లు, విమాన సిబ్బంది ఇక నుంచీ మౌత్‌వాష్, టూత్ జెల్‌లను వాడకూడదని ఆదేశాలు జారీ చేసింది. అందులో ఆల్కహాల్ ఉండటమే కారణమని తెలిపింది. అవి వాడటం వల్ల బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో పాజిటివ్ ఫలితాలు వస్తున్నాయని పేర్కొంది.
సివిల్ ఏవియేషన్ రిక్వైర్‌మెంట్‌లో (సీఏఆర్) మరికొన్ని నిబంధనలను మారుస్తూ డీజీసీఏ తాజాగా ప్రకటన జారీ చేసింది. ఇక నుంచీ ఏ సిబ్బందీ డ్రగ్స్, వాటి అవశేషాలుండే పదార్థాలను వాడకూడదని.. ఆల్కహాల్ కలిసి ఉండే మౌత్‌వాష్, టూత్‌జెల్‌లకు దూరంగా ఉండాలని పేర్కొంది. దీనివల్ల బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో సానుకూల ఫలితాలొస్తాయని… ఎవరైనా వైద్యుల సూచన మేరకు వాడుతుంటే విధుల్లోకి వెళ్లేముందు తాము పని చేసే సంస్థల వైద్యులను సంప్రదించాలని డీజీసీఏ వెల్లడించింది.