దేశమంతా తమ కుటుంబంతో కలిసి దీపావళి పండుగ చేసుకుంటే ప్రధాని మోదీ.. భారత సైన్యంతో కలిసి హిమాచల్ ప్రదేశ్ లోని లేప్చాలో దీపావళి వేడుకలు చేసుకున్నారు. అనంతరం సైనిక బలగాలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ.. భద్రతా బలగాలు వివిధ దేశాల్లో నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్లను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు.
అంతర్జాతీయ రక్షణ రంగంలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ధైర్యసాహసాలు కలిగిన సైనికులంతా హిమాలయాల్లా సరిహద్దుల్లో దృఢంగా ఉన్నంత వరకు భారత్ సురక్షితంగా ఉంటుందని ఉద్ఘాటించారు. సైనిక బలగాలు ఎన్నో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని విజయాలు సాధించాయని మోదీ తెలిపారు. పండుగవేళ కుటుంబానికి దూరంగా.. సరిహద్దుల్లో విధులు నిర్వహించడం.. సైనికుల నిబద్ధతకు నిదర్శనమని పేర్కొన్నారు. భారత భద్రతా బలగాలు పనిచేస్తున్న చోటు తనకు దేవాలయంతో సమానమని అన్నారు. సూడాన్ నుంచి భారతీయులను తీసుకువచ్చే మిషన్‌ను సైన్యం విజయవంతంగా పూర్తి చేసిందని.. తుర్కియేలో భూకంపం సంభవించినప్పుడు భారత బలగాలు ఎంతో ధైర్యసాహసాలతో సహాయకచర్యలు చేపట్టి అక్కడి ప్రజలను కాపాడాయని కొనియాడారు.