ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై నెల మొదట్లో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. జులై 8న ఈ పర్యటన ఉండవచ్చని, తేదీ ఖరారుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని దౌత్య వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఈ టూర్లో ప్రధాని మోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పలు అంశాలపై విస్తృతస్థాయి చర్చలు జరిపే అవకాశమున్నట్లు సమాచారం.
ఈ టూర్ కార్యరూపం దాల్చితే గత అయిదేళ్లలో ఇది ప్రధాని మోదీకి తొలి రష్యా పర్యటన అవుతుంది. ఇంతకు మునుపు 2019లో రష్యాలోని వ్లాడవాస్టాక్ నగరంలో జరిగిన ఆర్థిక సదస్సుకు ఆయన హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనకు సంబంధించి భారత్ వైపు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ మోదీ, పుతిన్ల భేటీకి క్రియాశీలక సన్నాహాలను తాము అపుడే ప్రారంభించినట్లు మాస్కోలోని క్రెమ్లిన్ అధికార వర్గాలు తెలిపాయి. ‘‘భారత ప్రధాని రాకకు మేము సిద్ధమవుతున్నట్లు నేను నిర్ధరించగలను. అయితే, పర్యటన తేదీని అపుడే చెప్పలేము. ఈ విషయం ఉభయులూ తర్వాత ప్రకటిస్తారు’’ అని రష్యా అధ్యక్షుడి సహాయకుడు యూరి ఉషకోఫ్ మీడియాకు వివరించారు.