పూరీ రత్న భాండాగారం లోపల విషసర్పాలు!

-

మరో రెండ్రోజుల్లో ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్నభాండాగారం తెరవనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. జస్టిస్‌ బిశ్వనాథ్‌రథ్‌ అధ్యక్షతన ఏర్పాటైన అధ్యయన సంఘం ఈ నెల 14న భాండాగారం తెరవడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనికి శ్రీక్షేత్ర పాలకవర్గం ఆమోదించినందున, ప్రభుత్వం ఇతర ఏర్పాట్లు చేయనుందని న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్‌ హరిచందన్‌ తెలిపారు. అధ్యయన సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు (ఎస్‌ఓపీ) పరిశీలిస్తున్నామని, దీనికి అనుగుణంగా అంతా సిద్ధం చేస్తామని వెల్లడించారు.

అయితే రత్నభాండాగారం తెరవడానికి ఎంతమంది వెళతారు? అన్నదింకా స్పష్టం కాలేదు. భాండాగారం లోపల చీకటిగా ఉండటమే గాక విషసర్పాలు ఉంటాయన్న అనుమానాలున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని సెర్చ్‌ లైట్లు, స్నేక్‌ హెల్ప్‌ లైన్‌ నిపుణులు, అత్యవసర వైద్యానికి డాక్టర్లు లోపలికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది. మరోవైపు భాండాగారానికి వెంటనే మరమ్మతులు చేయడానికి పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ) సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో స్వామి సంపద శ్రీక్షేత్రం లోపల మరో చోట భద్రపరిచి లెక్కింపు చేసే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version