మణిపుర్ అల్లర్ల కేసులు దర్యాప్తు చేస్తున్న పోలీసులకు కొత్త చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆ రాష్ట్రంలో భారీగా జీరో ఎఫ్ఐఆర్ లు నమోదవ్వడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు దాదాపు 6000కు పైగా జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైనట్లు అక్కడి పోలీసు అధికారులు చెబుతున్నారు. వీటిని దర్యాప్తు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపాల్సి ఉండగా.. రాష్ట్రంలో అల్లర్లు ఇంకా తగ్గకపోవడంతో వాటిని కట్టడి చేసే పనిలో బిజీగా ఉండటం వల్ల తీవ్ర జాప్యం ఏర్పడుతోందని అంటున్నారు.
మణిపుర్ అల్లర్లలో చాలా మంది బాధితులు వారి స్థానిక పోలీస్ స్టేషన్లలో కాకుండా.. తమ తెగ ప్రాబల్యం ఉన్న పీఎస్ లలో ఫిర్యాదులు చేస్తున్నారు. చాలా మంది తమ స్థానిక ప్రాంతంలో కొందరు అడ్డుకుంటున్నారని.. లేదా భయపెడుతున్నారనే కారణాలతో వేరే స్టేషన్లలో జీరో ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నారు. ఎక్కువ ఎఫ్‌ఐఆర్‌లు మైతేయ్ తెగకు చెందిన వారే దాఖలు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులపై దర్యాప్తు చేయడం పోలీసులకు ఓ సవాలుగా మారుతోంది.
ఈ రెండు తెగలకు చెందిన వారిపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను విచారించేందుకు పోలీసులు కూడా వెనకడుగు వేస్తున్నారు. దర్యాప్తు కోసం వారి ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఒక తెగకు చెందిన పోలీసు అధికారి వేరే తెగ నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లాలంటేనే వణుకుతున్నారు. తమ తెగకు చెందిన పోలీసులు వస్తేనే వాళ్లు కూడా అనుమతిస్తున్నారు. లేదంటే దాడికి దిగుతున్నారు. దీంతో ఎఫ్‌ఐఆర్‌లో పేరు ఉన్న వారిని ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేసి స్టేషన్‌కు రప్పించి మాట్లాడుతున్నారు. దీంతో దర్యాప్తులో తీవ్ర జాప్యం ఏర్పడుతోందని పోలీసు అధికారులు చెబుతున్నారు.