కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రచారం నిర్వహించారు. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు అక్కడ నిర్వహించిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అధికారంలో నుంచి తొలగించేందుకు దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు చేతులు కలిపారని ఆరోపించారు.
సభకు వచ్చిన మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘మాతృమూర్తులు, సోదరీమణులు ఇక్కడికి పెద్దసంఖ్యలో వచ్చారు. కుటుంబపోషణలో భాగంగా మీరు ఎదుర్కొంటున్న సవాళ్లు, చేస్తోన్న పోరాటం గురించి తెలుసు. దేశ, విదేశాల్లోని శక్తిమంతులైన వ్యక్తులు నన్ను అధికారం నుంచి తొలగించేందుకు ఏకమయ్యారు. కానీ.. నారీ, మాతృశక్తుల ఆశీర్వాదంతో వారితో పోరాడగలుగుతున్నాను. మహిళల భద్రతే నా ప్రాధాన్యం’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
సభలో భాగంగా వేదిక పంచుకున్న మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవగౌడపై మోదీ ప్రశంసలు కురిపించారు. 90 ఏళ్లలోనూ ఆయన ఉత్సాహం, నిబద్ధత తనలో స్ఫూర్తి నింపిందని అన్నారు. జేడీఎస్ గతేడాది సెప్టెంబరులో ఎన్డీయేలో చేరిన విషయం తెలిసిందే. కర్ణాటకలో మొత్తం 28 స్థానాలుండగా.. రెండు విడతల్లో (ఏప్రిల్ 26, మే 7) పోలింగ్ జరగనుంది.