కుంభమేళా తొక్కిసలాటలో మృతి చెందిన వారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ నివాళులర్పించలేదని.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. కుంభమేళా భారత సంస్కృతి, సంప్రదాయాలు చరిత్రను ప్రతిబింబించిందంటూ ప్రధాని చెప్పిన మాటలకు తాను మద్దతు ఇస్తానని అన్నారు. అయితే నివాళి అర్పించకపోవడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. కుంభమేళాకు వెళ్లిన యువత దేశ ప్రధాని నుంచి మరో మాట వినాలని అనుకున్నారు. వారికి ఉద్యోగాలు కావాలని పార్లమెంట్ బయట రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు.
ప్రజాస్వామ్య నిర్మాణం ప్రకారం.. ప్రధాని తరువాత లోక్ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే అవకాశం ఉండాలని.. ఈ నవ భారతంలో తనకు అవకాశం ఇవ్వలేదని అధికార పక్షం పై విమర్శలు చేశారు. విపక్షాలు తమ గళాన్ని వినిపించేందుకు తగిన అవకాశాలు ఇవ్వడం లేదని వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పేర్కొన్నారు. ఈ విమర్శలపై తాజాగా బీజేపీ స్పందించింది. రాహుల్ గాంధీకి లోక్ సభ నియమాలు అర్థం కాలేదని.. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తమ చర్యలను సమర్థించుకున్నారు. ప్రధాని లేదా మంత్రులు సభలో మాట్లాడుతున్నప్పుడు ఇతరులు మాట్లాడేందుకు అనుమతి లేదని ఆయన చెప్పినట్టు తెలిపారు.