గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మే 25వ తేదీన ఓ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో దాదాపు 27 మంది సజీవదహనమయ్యారు. వారిలో ఎక్కువగా పిల్లలే ఉండటం తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై పోలీసులు ముమ్మర దర్యాప్తు చేసి తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు.
15 మంది నిందితులపై లక్షకు పైగా పేజీలతో ఛార్జ్షీట్ను రాజ్కోట్ పోలీసులు దాఖలు చేశారు. 365 మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మూడు-నాలుగు నిమిషాల్లోనే మొత్తం భవనం అగ్నికీలలు చుట్టుముట్టడానికి అక్కడ భారీగా ఉన్న వస్తువులే కారణమని స్థానికులు చెప్పినట్లు వెల్లడించారు. నిర్మాణ సామగ్రి, స్పాంజి షీట్లు, చల్లదనాన్ని ఇచ్చే ఇన్సులేటర్లు, వెల్డింగ్ పనులతో వచ్చిన నిప్పురవ్వలే కారణమని స్పష్టం చేశారు. ఇవి క్షణాల్లో అంటుకోవడం వల్ల దాదాపు 27మంది సజీవ దహనమైపోయారని పేర్కొన్నారు.