అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరుకావడం లేదని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రారంభోత్సవ ఆహ్వానాన్ని హస్తం పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,సీనియర్ నేత అధీర్ రంజన్ చౌధరి,అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తిరస్కరించారని కాంగ్రెస్ తెల్పింది.’మతం అనేది వ్యక్తిగత అంశం .కానీ ఆర్ఎస్ఎస్ , బీజేపీ ఆలయ నిర్మాణం ఇంకా పూర్తి కాక ముందే రామాలయ అంశాన్ని పొలిటికల్ ప్రాజెక్టుగా మార్చాయి. 2019లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అనుసరించి, రామభక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నాం’ అని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది.
ఇదిలా ఉండగా.. 2024 జనవరి 22న జరిగే ప్రారంభోత్సవం కోసం ఏర్పాట్లు సాగుతున్నాయి.కాశీకి చెందిన పండిట్ లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలో రాముడి విగ్రహాన్ని నరేంద్ర మోడీ స్వయంగా గర్భగుడిలోకి తీసుకురానున్నారు. మరోపక్క తృణమూల్ కాంగ్రెస్ కూడా తాము హాజరుకావడం లేదని ,ఇవన్నీ బీజేపీకు సానుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.