ఢిల్లీలో ప్రధాని మోడీని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మోడీతో రిషి సునక్ ప్రత్యేకంగా చర్చించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను మంగళవారం మోడీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. రిషి సునక్ కుటుంబ సభ్యులను కలవడం చాలా ఆనందంగా ఉందని.. అనేకమైన అంశాలపై అద్భుతమైన సంభాషణ జరిగినట్లుగా పేర్కొన్నారు. రిషి సునాక్.. భారతదేశానికి గొప్ప స్నేహితుడు అని కొనియాడారు. యూకేతో సంబంధాల కోసం ఆసక్తి కలిగి ఉన్నట్లు మోడీ తెలిపారు.
రిషి సునక్తో పాటు ఆయన భార్య అక్షత మూర్తి, కుమార్తెలు కృష్ణ, అనుష్క, రాజ్యసభ ఎంపీ, అత్తగారు సుధా మూర్తి మోడీని కలిసిన వారిలో ఉన్నారు. రిషి సునాక్ కుటుంబసభ్యులతో పార్లమెంట్ భవనానికి చేరుకున్నారు. లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో రిషి సునక్కు స్వాగతం పలికారు. అంతకుముందు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను కూడా కలిశారు. ఇక ఫిబ్రవరి 17న విదేశాంగ మంత్రి జైశంకర్ను రిషి సునక్ కలిశారు.