అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు హాజరవుతున్న అతిథులకు ప్రసాదాలుగా వెండి నాణేలను పంపిణీ చేయనున్నారు. మరికొద్ది నిమిషాల్లో ప్రధాని మోదీ భూమి పూజలో పాల్గొంటారు. అనంతరం అతిథులకు ఆ నాణేలను పంపిణీ చేస్తారు. అయితే ఇప్పటికే అయోధ్యలో మహావీర్ మందిర్ ట్రస్ట్ వారు రఘుపతి లడ్డూ పేరిట అయోధ్యలో 1.25 లక్షల లడ్డూలను ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు.
ఇక ఆ వెండి నాణేలకు ఒక వైపు రామ్ దర్బార్ బొమ్మ ఉంటుంది. అందులో సీతారాములు, లక్ష్మణుడు, హనుమంతులు ఉంటారు. మరోవైపు ట్రస్టు చిహ్నం ఉంటుంది. అయోధ్య అతిథులకు లడ్డూల బాక్సులు, వెండి నాణేలు, రామ్ దర్బార్ ఫొటోలను ఇస్తారు. కాగా ఇవాళ్టి భూమి పూజకు 175 మంది అతిథులు హాజరవుతున్నారు. వారిలో ఎక్కువగా సాధువులే ఉన్నారు. చాలా తక్కువ సంఖ్యలో రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.
ప్రధాని మోదీతోపాటు ఈ పూజలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్లు పాల్గొంటారు. బీజేపీ సీనియర్ నాయకులు ఎల్కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొంటారు.