ఒడిశాను ఇటీవల తరచూ ప్రమాదాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే రైలు ప్రమాదం.. ఆ తర్వాత వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక తాజాగా మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. ఒడిశాలోని కెందుఝార్ జిల్లా సటిపూర్‌లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 20వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగింది.
శాతిగఢ్కు చెందిన సహీర్ కార్తిక్ పంగే కూతురు వివాహం.. మన్పుర్కు చెందిన హరిబంధు కుమారుడు హేమంత్‌తో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధువు ఇంటికి వరుడు హేమంత్ తన కుటుంబ సభ్యులు, బంధువులతో బరాత్‌గా బయల్దేరాడు. ఇంకా కొద్ది సేపటిలో వధువు ఇంటికి చేరుకోనున్న సమయంలో ఓ ట్రక్కు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.