భార్యాభర్తల మధ్య పరస్పర గౌరవం, సర్దుబాటు, సహనం దృఢమైన వివాహ బంధానికి పునాదులంటూ వైవాహిక బంధంపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. చిన్న చిన్న వివాదాలు, విభేదాలు, అపనమ్మకాలతో, స్వర్గంలో నిర్ణయమైనదిగా భావించే పవిత్ర వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తెచ్చుకోవద్దని సూచించింది. ఓ మహిళ తన భర్తపై నమోదు చేసిన వరకట్న వేధింపుల కేసును కొట్టివేస్తూ జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్ర ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది.
భార్యాభర్తల మధ్య తలెత్తే మనస్పర్థలను చాలా సందర్భాల్లో ఆమె తల్లిదండ్రులు, బంధువులు సున్నితంగా పరిష్కరించకపోవడమే కాకుండా ఇంకా పెద్దది చేస్తుంటారని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. పోలీస్‌స్టేషన్లలో కేసులతో పరిస్థితి మరింతగా చేయిదాటి పోతోందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనివల్ల వారి వైవాహిక బంధం మరమ్మతుకు వీల్లేనంతగా సమస్యల్లో చిక్కుకుంటోందని ఆనేదన చెందింది. దంపతులు విడిపోవడం వల్ల మొదట బాధితులయ్యేది వారి సంతానమేనని, అందువల్ల దాంపత్య సమస్యలతో వచ్చే కేసులను కోర్టులు యాంత్రికంగా విచారించి విడాకులు మంజూరు చేయడం తగదని కోర్టు స్పష్టం చేసింది.