తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారంలో బిజీగా ఉన్నారు. కీలక నేతలు వారికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ప్రచారంలో భాగంగా మాట్లాడుతున్న సందర్భంలో కొందరు నేతలు అదుపుతప్పుతున్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ చేరారు.
సిద్దిపేట అంబేడ్కర్ చౌరస్తాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి కొండా సురేఖ.. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలోనే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ఒక్కొక్కరూ పది ఓట్లు వేసైనా సరే.. మన అభ్యర్థిని గెలిపించాలని’ పిలుపునిచ్చారు. అలా ఓట్లు అభ్యర్థించడం ఇప్పుడు వివాదాస్పదమైంది. కులాన్ని ప్రస్తావిస్తూ ఓట్లు అడిగారని, ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఆమె చేసిన ప్రసంగంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి భారత్ రాష్ట్ర సమితి ఫిర్యాదు చేసింది.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నేపథ్యంలో తెలంగాణ స్టార్ క్యాంపెయినర్‌గా రేవంత్ రెడ్డిని తొలగించాలని, రేవంత్ రెడ్డి, కొండా సురేఖలపై ప్రచారంపై నిషేధం విధించాలని ఈసీని కోరింది. అలాగే మెదక్ కాంగ్రెస్ అభ్యర్ధి నీలం మధుపై అనర్హత వేటు వేయాలని ఫిర్యాదు చేసింది.