కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జన్‌ధన్ యోజన పథకం ద్వారా ఆర్థిక సమ్మిళితత్వం పెరిగిందని, కోట్లాది మంది మహిళలకు గౌరవం కల్పించిందని భారత ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బుధవారం ప్రధాని తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్‌లో జన్‌ధన్ యోజన పథకం గురించి ప్రత్యేకంగా ట్వీట్ చేశారు.
ఈ పథకం తీసుకొచ్చి నేటితో పదేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ..ఇదోక అద్భుత సందర్భం, జన్ ధన్ యోజనకు పదేళ్లు పూర్తయ్యాయి. లబ్దిదారులు, పథకం విజయవంతం అయ్యేలా కృషి చేసిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.
ఆర్థిక సమ్మిళితత్వం, మహిళలు, యువత, అణగారిన వర్గాల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం కీలకంగా మారింది’ అని ప్రధాని మోడీ రాసుకొచ్చారు. కాగా, దేశవ్యాప్తంగా మహిళలకు జన్‌ధన్ యోజన ఖాతాలు తెరిపించాక గ్యాస్, ఇతర సంక్షేమ పథకాలు, నగదు బదిలీ స్కీములకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడినట్లు లబ్దిదారులు పేర్కొన్న విషయం తెలిసిందే.