భారతదేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, దేశ ప్రజలు సైన్యంపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. టైమ్స్ నౌ సమ్మిట్ ముగింపు సందర్బంగా మాట్లాడిన ఆయన దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రక్షణకు సంబంధించిన అన్ని విషయాలు బయటకు చెప్పలేము, కానీ దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను, మన సైన్యం, భద్రతా సిబ్బందిపై పూర్తి విశ్వాసం కలిగి ఉండాలని అన్నారు. ఐదేళ్లు రక్షణ మంత్రిగా, అంతకుముందు హోం మంత్రిగా ఉన్న నేను, అన్ని పరిస్థితులను చూశాక మన సరిహద్దులు, దేశం పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని దేశ ప్రజలకు చెబుతున్నానని ఆయన చెప్పారు.
సరిహద్దు దేశాలతో ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వాటిని విస్తృతమైన దౌత్య, సైనిక చర్చల ద్వారా పరిష్కరించుకుంటున్నాము. మే 5, 2020న పాంగాంగ్ సరస్సు ప్రాంతంలో జరిగిన హింసాత్మక ఘర్షణ తర్వాత తూర్పు లడఖ్ సరిహద్దులో ప్రతిష్టంభన ఏర్పడింది. అయితే సైనిక, దౌత్యపరమైన చర్చల ఫలితంగా ఇరుపక్షాలు ఈ సమస్యను పరిష్కరించాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అలాగే అగ్నివీర్ గురించి మాట్లాడుతూ, ఇది సాయుధ బలగాలను ఆధునీకరించడంలో సహాయపడుతుందని అన్నారు.