ఆ హంతకులకు, జగన్ కి ఓటు వేయవద్దు: వివేకా కుమార్తె సునీత

-

హంతకులకు ఓటు వేయవద్దని మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీత మరోమారు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ హైకోర్టు వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు. వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీఎం జగన్ ప్రొద్దుటూరు సభలో చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘చిన్నాన్న అంటే అర్థం తెలుసా? నాన్న తర్వాత నాన్న.. అలాంటి వ్యక్తిని చంపితే కుట్రను ఛేదించలేదు.  చిన్నాన్న కుమార్తె పైనే నిందలు వేయడం న్యాయమా? మీ చెల్లి కోర్టులు, పోలీసుల చుట్టూ తిరుగుతుంటే అన్నగా మీ బాధ్యత ఏంటి? బంధుత్వాలకు అర్థం తెలుసా? చిన్నాన్నను ఎవరు చంపారో దేవుడికి తెలుసు, జిల్లా ప్రజలకు తెలుసు అంటున్నారు. అవును మీరు నిజమే చెప్పారు. వివేకాను చంపించింది ఎవరో.. దేవుడికి, మీకు, జిల్లా ప్రజలకు తెలుసు. అందుకే నిందితులను అంత బాగా రక్షిస్తున్నారు.


హంతకుడే చెబుతున్నాడు.. వైఎస్ భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి వివేకాను హత్య చేయించారని. ఒకరు చెప్పింది నమ్ముతున్నారు.. ఇంకొకరు చెప్పింది నమ్మడం లేదు. ఐదేళ్లు మీ ప్రభుత్వం ఉండి కూడా ఏం చేశారు? నిందితులను రక్షించేది మీరు కాదా? గతంలో సీబీఐ విచారణ కోరింది మీరే.. ఆ తర్వాత పిటిషన్ ఉపసంహరించుకున్నదీ మీరే. ఎన్నికలు వస్తున్నాయని ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా? మీరు చేయాల్సిన పని సరిగా చేయనందుకే బయటకు రావాల్సి వచ్చింది. ఎవరు స్వార్ధపరులు? ఎవరు పదవుల కోసం హత్య కేసును వాడుకుంటున్నారు’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సునీత.

Read more RELATED
Recommended to you

Exit mobile version