సిబ్బందికి చెప్పినా ట్రంప్ ను అప్రమత్తం చేయలేదని ప్రత్యక్ష సాక్షి తాజాగా వెల్లడించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పులు జరిపిన వ్యక్తిని చూసినట్లు ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. ర్యాలీకి సమీపంలోని బిల్డింగ్ రూప్పై ఓ వ్యక్తి రైఫిల్తో ఉన్నాడని సీక్రెట్ సర్వీస్కు చెప్పినట్లు తెలిపారు. సిబ్బంది ట్రంప్ను అప్రమత్తం చేయలేదని, ఆ వెంటనే కాల్పుల శబ్దం వచ్చిందన్నారు. ఈ వీడియోను మస్క్ ట్వీట్ చేయడం గమనార్హం. ఈ ఘటనలో దుండగుడిని పోలీసులు మట్టుబెట్టిన సంగతి తెలిసిందే.
ఇక అటు.. తనపై హత్యాయత్నం తర్వాత… అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా స్పందించారు. ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో శబ్దంతో ఏదో చెవిపై దూసుకుపోయినట్లు అర్థమైందని ఆయన వివరించారు. రక్తస్రావం జరగడంతో ఆ తర్వాత ఏమైందో గ్రహించినట్లు ఆయన వెల్లడించారు. దీంతో వెంటనే అప్రమత్తమై మోకాళ్లపై కూర్చున్నట్లు వెల్లడించారు. దేశంలో ఇలాంటి సంఘటన జరగడం నమ్మశక్యంగా లేదని ఆవేదన వ్యక్తం చేశారు.