ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై భిన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. దళితుల రిజర్వేషన్లను ఉపవర్గీకరించేందుకు రాష్ట్రాలకు అనుమతిస్తూ ఇచ్చిన తీర్పుపై ‘లోక్ జనశక్తి పార్టీ’ (రాంవిలాస్) నేత, కేంద్ర మంత్రి చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు చేస్తామని తెలిపారు. వర్గీకరణను వ్యతిరేకించిన ఆయన అంటరానితనం వల్ల బాధితులుగా మిగిలిన అణగారినవర్గాలను పైకి తీసుకువచ్చేందుకు ఎస్సీ కోటాను ప్రవేశపెట్టారని.. ఉప వర్గీకరణ వల్ల అసలు ప్రయోజనం నెరవేరకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
అంటరానితనం అనే పదాన్ని కోర్టు తీర్పులో ఎక్కడా ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరమని చిరాగ్ అన్నారు. చదువుకునే అవకాశం అందుబాటులో ఉన్న సంపన్నవంతులైన దళితులు సహా ఎస్సీల్లో అత్యధికులు అంటరానితనాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉపవర్గీకరణను అనుమతించడం న్యాయసమ్మతం కాదని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడిన ఆయన.. ఆ వివరాలను బహిర్గతం చేయనక్కర్లేదని చెప్పారు. దళితుల కోటాలో క్రీమీలేయర్‌ను తాము వ్యతిరేకిస్తున్నామని ఈ సందర్భంగా చిరాగ్ పాస్వాన్ పేర్కొన్నారు.